మళ్లీ ఫుడ్ పాయిజన్.. విద్యార్థుల ప్రాణాలకు లెక్కలేదా..?

17-09-2026 | 05:18pm

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్పీ హైస్కూల్‌(ZP High School)లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం అనంతరం సుమారు 20మంది విద్యార్థులతో పాటు వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ అస్వస్థతకు గురయ్యారు.వైస్ ప్రిన్సిపల్(Vice Principal) వెంకటేష్ ఇంట్లో నిన్న ఓ ఫంక్షన్ జరిగినట్లు సమాచారం. ఆ ఫంక్షన్‌లో మిగిలిన ఆహారాన్ని పాఠశాల సిబ్బంది ఇవాళ మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించినట్లు తెలుస్తోంది. భోజనం చేసిన అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మరోవైపు అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 15 మందికి సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఐదుగురు విద్యార్థులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థులకు వడ్డించిన ఆహారం కారణంగానే అస్వస్థతకు గురయ్యారా అనే అంశంపై వైద్య, సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు