మోదీ కాల్‌తో స్మిత్ ఎమోషనల్!
న్యూఢిల్లీ: కష్ట సమయంలో ధైర్యం కోల్పోకుండా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు( flydubai pilot Smit Machchaar) ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. అబుదాబిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ ఆరోగ్య పరిస్థితిని మోదీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో ఆయన ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రధాని ప్రశంసించారు. ఫ్లైదుబాయ్‌కి చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తుండగా కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై(Smit Machchaar) కో-పైలట్ దాడి చేసినట్లు అధికారులు, పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే అవకాశం ఏర్పడింది. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
మోదీతో స్మిత్ సంభాషణ
ఫోన్ సంభాషణలో ప్రధాని మోదీ(Narendra Modi).. స్మిత్ ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో తనకు ఎదురైన పరిస్థితులను, కో-పైలట్ దాడి చేసిన తీరును స్మిత్ వివరించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఆ సమయంలో తనకు ధైర్యాన్ని ఇచ్చిన అంశాలను కూడా ఆయన మోదీతో పంచుకున్నట్లు సమాచారం. తబుక్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం స్మిత్‌ను అబుదాబికి తరలించారు. భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆస్పత్రిలో స్మిత్‌ను కలుసుకుని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్మిత్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని, మాట్లాడుతున్నారని, నవ్వుతూ కనిపించారని రాయబారి తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోందని భారత దౌత్య వర్గాలు వెల్లడించాయి.
ధైర్యానికి మోదీ ప్రశంసలు
తీవ్ర గాయాల మధ్య కూడా ప్రయాణికుల భద్రత కోసం స్మిత్ తీసుకున్న నిర్ణయాలను మోదీ అభినందించారు. ఆయన ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రధాని ప్రశంసించారు. ఈ ఘటన తర్వాత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు భారత్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అబుదాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉండటంతో ఆయన కుటుంబ సభ్యుల్లోనూ ఉపశమనం కనిపిస్తోంది. ఈ ఘటనపై UAE సహా సంబంధిత దేశాల దర్యాప్తు కొనసాగుతోంది.