పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
- విధి నిర్వహణలో ఆదర్శంగా ఎస్‌ఐ తాజుద్దీన్
- ప్రశంసా పత్రం అందజేసిన ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్
గోవిందరావుపేట,(విజయ క్రాంతి): ములుగు ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో పోక్సో కేసుకు సంబంధించి తీర్పులో నిందితునికి శిక్ష పడింది. వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 14/2023 కేసులో నిందితుడికి కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 4,200 జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్లు 354-డి, 448, 290, 506తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11(ఆర్) రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది.
ఈ కేసుకు సంబంధించి ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు, ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్యచంద్ర కళ తీర్పు వెలువరించారు. కేసులో నిందితుడైన కొండాపూర్ గ్రామానికి చెందిన ల్యాదల్ల రాజనీకాంత్ కు కోర్టు నేరం రుజువైన నేపథ్యంలో శిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా పోలీసుల తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి మొదటి దశలో హెడ్ కానిస్టేబుల్ ఏ. బాలయ్య (HC-393) ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, అనంతరం ఎస్‌ఐ ఎస్‌కే తాజుద్దీన్ దర్యాప్తు నిర్వహించారు.
కోర్టు మానిటరింగ్ అధికారిగా డీఎస్పీ కిషోర్ వ్యవహరించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా డి. రామ్‌సింగ్ కేసును వాదించారు. పోక్సో కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు, కోర్టు పర్యవేక్షణ, ప్రాసిక్యూషన్ సమన్వయంతో పనిచేస్తున్న పోలీసు అధికారులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కాగా విధి నిర్వహణలో పసరా ఎస్సై పనిచేయడంతో రామ్నాథ్ కేకన్ పసరా ఎస్సై ప్రశంస పత్రాన్ని అందజేస్తూ అభినందించారు. విధి నిర్వహణలో చూపిన నిజాయితీ నిబద్ధత అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.
వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్ క్రైమ్ నంబర్ 14/2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల శిక్ష పడేలా కేసు దర్యాప్తు, న్యాయస్థానంలో కేసు పురోగతి తదితర అంశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఎస్‌ఐ తాజుద్దీన్ సేవలను ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ శాఖలో ప్రజలకు న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేసుల దర్యాప్తులో నాణ్యత, న్యాయస్థానాల్లో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌కు అవసరమైన సహకారం, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయడం పోలీసుల బాధ్యత అని తెలిపారు.
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించడం ద్వారా పోలీసు శాఖలో మరింత బాధ్యతాయుతమైన సేవా స్ఫూర్తి పెంపొందుతుందని అన్నారు. ప్రశంసా పత్రం అందుకున్న ఎస్‌ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అందించిన ఈ గుర్తింపు తనకు మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, చట్టాన్ని కాపాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతో ముందుకు సాగుతున్న ఎస్‌ఐ తాజుద్దీన్‌ను పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పి మనన్ బట్, ములుగు అడిషనల్ ఎస్పీ సదానందం, ములుగు డిఎస్పి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.






