వికృత చేష్టలతో కలవరం!

04-10-2026 | 05:20am

ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence) కంటెంట్ వైరల్ అవుతోంది. అయితే, ఏఐ టెక్నాలజీ ద్వారా కొందరు సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏఐని ఉపయోగించి హీరోహీరోయిన్ల వీడియోలు, ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం ఇటీవల విఫరీతమైంది. తాజాగా ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే..’ పాటను ఏఐ ఉపయోగించి అసభ్యంగా సృష్టించడం సినీవర్గాల్లో దుమారం రేపింది.

ఈ ఘటనపై ఆ సినిమా హీరోయిన్ జాన్వీకపూర్ స్పందిస్తూ, తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. “ఏఐ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఏఐ ద్వారా సృష్టించిన ఇలాంటి నకిలీ వీడియోలను దయచేసి ఎవరూ ఇతరులతో షేర్ చేయవద్దు. ఇది ఏఐ టెక్నాలజీని స్పష్టంగా దుర్వినియోగం చేయడమే. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అంటూ ఎక్స్ వేదికగా గట్టి హెచ్చరిక జారీ చేసింది జాన్వీ.

ఇదే విషయమై హీరో ఎన్టీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు’ అంటూ హెచ్చరించారు. “ఇది అత్యంత అసహ్యకరమైన చర్య. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే నేల మనది. మాతృదేవోభవ అనే నినాదం మన సంస్కృతిలో భాగమైన చోట కొందరు అత్యంత దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఒక మహిళను అవమానించేలా ఏఐని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి నీచమైన కంటెంట్‌ను సృష్టించడం సిగ్గుచేటు. ‘చుట్టమల్లే..’ పాట మార్ఫింగ్ వీడియో వెనుక ఉన్న నీచులెవరినీ వదిలిపెట్టను” అని హెచ్చరించారు ఎన్టీఆర్. 

మరిన్ని వార్తలు