రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్న బీజేపీ
మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం...
ఆదిలాబాద్, సెప్టెంబర్ 19, (విజయక్రాంతి) : బీజేపీ నాయకులు (BJP leaders) రోజురోజుకు విభిన్న తరహాలో వ్యవహరిస్తూ, రాజకీయ ప్రయోజనాల (Political interests) కోసం ప్రజలను మోసం చేయగలమణి, ఇక రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని సైతం రాజకీయాలకు ఉపయోగించుకునే స్థాయికి వారి వ్యవహార శైలి దిగజారిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ అభివృద్ధిపై ఎంపీ, ఎమ్మెల్యే లు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లకుండా కేవలం కమిషన్లకు సంబంధించిన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్‌తో పాటు జైనథ్, బేల ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే పనులపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జోగు రామన్న ప్రశ్నించారు. ఆదిలాబాద్‌కు రావాల్సిన రైల్వే ఫిట్‌లైన్ పనులు మహారాష్ట్రకు తరలిపోవడం స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌ను అమృత్ 2.0 పథకం కింద అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారని, అయితే ఇప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారూ. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, స్థానికంగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పనులు ఎందుకు నిలిచిపోయాయని ప్రశ్నించారు. ఇకనైనా మోసపూరిత మాటలను పక్కనపెట్టి ఆదిలాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని జోగు రామన్న సూచించారు. ఈ సమావేశంలో నాయకులు అజయ్, చందాల రాజన్న, సేవ్వా జగదీష్, దమ్మపాల్, కొండ గణేష్, శ్రీనివాస్, రమేష్, మహేష్, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.