కలెక్టర్ చొరవతో వృద్ధుడికి కుటుంబ సభ్యుల అండ
కుమారుడితో ఇంటికి చేరిన వృద్ధుడు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కుటుంబ సభ్యుల ఆదరణకు దూరమై ఇబ్బందులు పడుతున్న వృద్ధుడికి జిల్లా కలెక్టర్ కె.హరిత చొరవతో తిరిగి కుటుంబ సభ్యుల అండ లభించింది. కాగజ్‌నగర్ మండలం(Kagaznagar Mandal) బోడేపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వృద్ధుడు(Elderly man) తన కుమారుడు పట్టించుకోవడం లేదని, పోషణ బాధ్యతలు నిర్వహించడం లేదని ఈ నెల 18న జిల్లా సమీకృత కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు తన సమస్యను వివరించారు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ కె.హరిత(Collector K. Haritha) వెంటనే స్పందించి వృద్ధుడిని స్వయంగా పరామర్శించి, ఆయన పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన రక్షణ, వసతి కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్ధుడి పరిస్థితి తెలుసుకున్న ఆయన కుమారుడు స్పందించి, ఇకపై తండ్రి బాధ్యతను తానే స్వీకరిస్తానని హామీ ఇచ్చారు.కలెక్టర్ చొరవతో కుమారుడికి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించడం కుటుంబ సభ్యుల బాధ్యత అని వివరించి, తండ్రికి ప్రేమ, ఆప్యాయత, భద్రత, సంరక్షణ అందించాలని సూచించారు.
అనంతరం కుమారుడు మల్లయ్యను ఇంటికి తీసుకెళ్లడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు కుటుంబానికి భారంగా కాకుండా మార్గదర్శకులుగా ఉంటారని, వృద్ధాప్యంలో వారికి కుటుంబ సభ్యుల అండ, ఆప్యాయత, భద్రత ఎంతో అవసరమని అన్నారు. వృద్ధుల గౌరవం, భద్రత, సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.