మాదాపూర్ ఓయోలో డెడ్‌బాడీ.. ప్రియుడే కిల్లరా..!
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 22(విజయక్రాంతి): మాదాపూర్ సిద్ధిఖీనగర్‌లోని ఓయో హోటల్(OYO Hotel)లో విశాఖపట్నం యువతి అనుమానాస్పదంగా మృతి చెందడంతో నగరంలో కలకలం నెలకొంది. మృతురాలిని షారోన్ నిఖిత టోప్నోగా మాదాపూర్ పోలీసులు(Madhapur Police) గుర్తించారు. ఆమెతో కలిసి గది తీసుకున్న ప్రియుడు శ్రీనివాస రవి తేజ ఆసుపత్రి నుంచి తప్పించుకుపోయాడు. ప్రాథమిక విచారణలో తెలిసిందేమిటంటే.. సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ హైదరాబాద్ చేరుకుని, సిద్ధిఖీనగర్ రోడ్ నం.5లోని హోటల్ ఓఎస్‌ఎల్‌ఎన్ టెర్మినస్‌లో 303వ గదిని ఓయో యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. తెల్లవారుజామున సుమారు ఒంటిగంటకు కొండాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి మహిళ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది.
యువతిని ప్రియుడు, హోటల్ సిబ్బందితో కలిసి అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అక్కడికి చేరేలోపే ప్రాణాలు పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ముఖం, తలపై తీవ్ర గాయాలు, వాపులు కనిపించడంతో హత్యగా అనుమానం బలపడింది. ఆసుపత్రికి వచ్చిన రవి తేజ సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలమైన 303వ గదిని పరిశీలించిన పోలీసులకు గోడలపై, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి కీలక ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా రవి తేజే దాడి చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నివేదిక వస్తేనే మరణానికి అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది.