రెవెన్యూ శాఖలో అవినీతి సామ్రాట్లు
ఒక్కో పనికి ఒక్కో రేటుతో జరుగుతుంది
కాసులకు కక్కుర్తి పడ్డ ఆర్ఐ రిమాండ్
బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గంలో రెవెన్యూ(Revenue ) అధికారుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి దళారీల ద్వారా పనులు చేయించుకోవలసి వస్తుందని పలువురు వాపోతున్నారు. అధికారులను అడిగే వారు లేకపోవడంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఏసీబీ కి పట్టుబడ్డ డోంట్ కేర్
అవినీతి అధికారులపైన ఏసీబీ అధికారులు దృష్టి సారించి పట్టుకున్న అవినీతి సామ్రాట్(Corruption empires)లో ఏమాత్రం జంకడం లేదు. దీంతో లంచావతారులదే పైచేయగా నిలుస్తున్నది. మారుమూలన ఉన్న బజార్హత్నూర్ మండల కేంద్రంలో రెవెన్యూ అధికారి గత మూడు నెలల క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు. అయినా రెవెన్యూ అధికారుల్లో ఏమాత్రం మార్పు రాలేదని అంటున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాలలో రెవెన్యూ అధికారులు వివిధ పనుల కోసం వచ్చిన వారిని జలగల్లా పిండి పిప్పి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
రైతు వద్ద నాలుగు లక్షల డిమాండ్
బజార్హత్నూర్ మండలంలోని ఉమర్ధ గ్రామానికి చెందిన రైతు భూమిని వారసత్వంగా మార్పిడి చేసేందుకు సంబంధిత ఆర్ఐ నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే రైతు 2 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వడం జరిగిందని అంటున్నారు. పట్ట మార్పిడి రేపు మాపు అంటూ కాలయాపన చేయడంతో విసుగు చెందిన రైతు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణ జరిపించారు. అయితే రెండు లక్షలు తీసుకొని రైతును మోసగించాడు అన్న ఆరోపణపై ఆర్ ఐ నిసోమవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు...
తహసిల్ కార్యాలయంలో దొంగతనం పై అనుమానాలు
గత 15 రోజుల క్రితం తాసిల్దార్ కార్యాలయంలో దొంగతనం జరిగింది. కొన్ని ముఖ్యమైన ఫైలు దొంగతనం జరగడం వెనుక ఏముంది అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా డాక్యుమెంట్ల కోసం దొంగతనం చేశారా అన్న కోణంలో విచారణ జరుగుతుంది.
అసైన్డ్ భూముల మార్పిడి అధికారులకు వరం
వివిధ మండలాలలో కొంతమంది రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములను అనధికారికంగా మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లక్షల రూపాయలు దండుకొని ఈ అక్రమ పట్టాలను ఇస్తున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూముల మార్పిడి ఒక్కో ఏరియాకు ఎకరాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నట్లు తెలిసింది.
డెత్ సర్టిఫికెట్ కావాలంటే బ్రోకరే
కొన్ని మండలాల్లో డెత్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి విసిగి చెందిన బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఆదిలాబాద్ లో ఉన్న రెవెన్యూ సిబ్బందితో సంబంధాలు కొనసాగిస్తూ ఒక్కో సర్టిఫికెట్ కు 2000 రూపాయలు తీసుకొని సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కొంతమంది అధికారుల తీరు వల్ల రెవెన్యూ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తున్నది.