మందమర్రి టు చందమామ.. ఫుల్ హంగామా!
‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల సమర్పకుడిగా వ్యవహరిస్తూ ‘చంద్రయాన్‘(Chandrayaan) టైటిల్‌తో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేశ్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ మూవీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా, ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.. “ఈ మధ్య చిన్న చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే గొప్ప నక్షత్రాల్లో పుట్టినవారు ఈ మూవీటీమ్‌లో ఉన్నారు.
కృతిక నక్షత్రయుక్త పౌర్ణమి కార్తీకమాసం అక్టోబర్ 30న రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది” అన్నారు. చిత్ర సమర్పకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ.. “ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా. కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ట్రీమ్‌మెంట్‌తో రూపొందించారు. అమాయకులైన నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్‌లోకి వెళ్లడం..
ఈ జర్నీలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలుసుకున్న విషయాలను అద్భుతంగా తెరకెక్కించారు” అని చెప్పారు. హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ.. “నిజమైన చంద్రయాన్ కంటే మా చంద్రయాన్ చేయడం కష్టం. ఎందుకంటే 40 రోజుల్లో ఏకధాటిగా సినిమా షూటింగ్ చేశాం. మా మూవీ అందరికీ కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం” అన్నారు. హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని మాట్లాడుతూ.. “తెలుగు సినిమాల్లో నటించాలని కలగంటూ వచ్చాను.
ఈ చిత్రంతో నా కల నిజమైంది. తెలుగు సినిమాను మన దేశమే కాదు ప్రపంచమంతా ఇష్టపడుతోంది. ఇలాంటి ఇండస్ట్రీలో భాగమవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో బిందు అనే పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది” అని చెప్పింది. డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “మందమర్రి టు చందమామ, ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. ఈ హంగామా మిమ్మల్ని 2 గంటల 15 నిమిషాలు ఆగకుండా నవ్విస్తుంది.
గ్లింప్స్ చూసి మా యాక్టర్స్ అమాయకులు అంటున్నారు. కానీ వీళ్లు అమాయకులే కాదు ధైర్యవంతులు కూడా. ఎవరైనా వీళ్లకు పాకిస్తాన్ మనల్ని ఇబ్బందిపెడుతుంది అంటే దాని మీద బాంబులు వేసి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు. అంత ధైర్యవంతులు. వీళ్లు ఏమీ తెలియకుండా రాకెట్ ఎలా చేశారు, స్పేస్‌కు ఎలా వెళ్లారు. ఎక్కాలు రాకుండా రాకెట్‌కు కావాల్సిన లెక్కలు ఎలా చేశారు అనేది మీరంతా సినిమాలో చూడబోతున్నారు” అన్నారు.
‘కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత ఉండదు. థియేటర్‌లో ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటాడని గ్యారెంటీగా చెప్పగలన’ని చిత్ర నిర్మాత ప్రవీణ్ మొలక తెలిపారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ పూజారి నాగేశ్వరరావు, చిత్ర సంగీత దర్శకుడు హర్ష ప్రవీణ్, నటీనటులు లోకేశ్, రవి శివతేజ కూడా ఈ వేడుకలో మాట్లాడారు.