వినాయక నిమజ్జనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ
ఆర్మూర్,(విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం(Ganesh Immersion Procession) జరుపుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య(Police Commissioner P. Sai Chaitanya), ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో కలెక్టర్ శనివారం గణేష్ శోభాయాత్ర(ganesh procession routes) కొనసాగే మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే యంచ శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని, నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి పరీవాహక ప్రాంతాన్ని, ఆర్మూర్ లోని గుండ్ల చెరువును కలెక్టర్, సీ.పీ నిశితంగా పరిశీలన జరిపారు.
అక్కడక్కడా గుంతలు పడిన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి భిగించాలని సూచించారు. జానకంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా ఎనిమిది అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు.
యంచ గోదావరి బ్రిడ్జి తో పాటు, ఉమ్మెడ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్సు, మెడికల్ క్యాంపు లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో శోభాయాత్ర కొనసాగే దుబ్బా ప్రాంతం నుండి వినాయకుల బావి వరకు గల ప్రాంతాలను సైతం కలెక్టర్, సీ.పీలు సందర్శించారు.
వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని, వారి సూచనలు పాటిస్తూ, నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ, ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ అలీ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ, రవాణా, విద్యుత్, వైద్యారోగ్య తదితర శాఖల అధికారులు ఉన్నారు.