మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం
కల్వకుర్తి సెప్టెంబర్ 18: పంజుగుల వద్ద సోలార్ ప్లాంటు(Solar Plant)లో డ్యూటీలో ఉండగా గత నెల మృతి చెందిన రఘుపతి పేటకు చెందిన మొహమ్మద్ అలీ కుటుంబానికి ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకున్న 2004 బ్యాచ్‌కు చెందిన స్నేహితులు అండగా నిలిచారు. తమ వంతు సహకారంగా రూ.40 వేల ఆర్థిక సాయాన్ని శుక్రవారం అలీ కుటుంబ సభ్యులకు అందజేశారు.
స్నేహితుల్లో ఒకరైన దండుగుల వెంకటేష్ తన వంతుగా పెద్ద మనసుతో ముందుకు వచ్చి, అలీ కుమార్తెకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి సంవత్సరం రూ.20 వేల చొప్పున కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం తన ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని క్రమం తప్పకుండా జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తమ కష్టకాలంలో ఆర్థికంగా అండగా నిలిచి, భవిష్యత్తులోనూ సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన చిన్ననాటి మిత్రులకు మొహమ్మద్ అలీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వంతో స్పందించిన స్నేహితుల సహకారం తమ కుటుంబానికి ఎంతో ధైర్యాన్నిచ్చిందని వారు పేర్కొన్నారు.