భూబాధితుల జేఏసీ నాయకుల ముందస్తు అరెస్టులు
కొత్తపల్లి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి):కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి, రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన భూబాధితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బుదవారం సాయంత్రం 4:30 గంటలకు కరీంనగర్లో నూతన కలెక్టర్ భవన సముదాయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)రానున్న నేపథ్యంలో, భూబాధితుల జేఏసీ నాయకులు ఆయనకు వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమయ్యారు.
అయితే, వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే కారణంతో బుధవారం రోజున ఉదయం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. గత సంవత్సరం కాలంగా కొత్తపల్లి, రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 800 ఎకరాల భూములను నిషేధిత జాబితా 22/Aలో చేర్చడంతో దాదాపు 10 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ సొంత ఇళ్లు, ప్లాట్లను అమ్ముకోలేక, కొనలేక ఆర్థికంగా, మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం బాధితులు హైకోర్టు గతంలో 22/Aకు సంబంధించి ఇచ్చిన తీర్పుల ప్రతులతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు సమర్పించినప్పటికీ, పరిశీలిస్తామని చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాధితులంతా ఐక్యంగా జేఏసీగా ఏర్పడి గత సంవత్సరం కాలంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లను కలిసి తమ సమస్యను పలుమార్లు విన్నవించారు.
ఇటీవల నిషేధిత 22/A భూముల విముక్తికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ, కరీంనగర్‌లోని కొత్తపల్లి, రేకుర్తి ప్రాంతాల భూముల ప్రస్తావన లేకపోవడంతో బాధితుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటన సందర్భంగా తమ సమస్యను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లి, వినతిపత్రం అందజేయాలని జేఏసీ నాయకులు నిర్ణయించుకున్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం బాధితుల గొంతు నొక్కే చర్యగా వారు అభివర్ణిస్తున్నారు.జేఏసీ కన్వీనర్ పాశం మోహన్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, 19వ డివిజన్ కార్పొరేటర్ భర్త సుదగోని కృష్ణ, రేకుర్తి మాజీ సర్పంచ్ నందేల్లి ప్రకాశ్, జేఏసీ ఉపాధ్యక్షుడు ఆకుల కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు సైఫోద్దీన్ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.