ఎస్పీ రోహిత్ రాజు.. అర్థరాత్రి పీఎస్‌ల తనిఖీ
కొత్తగూడెం సెప్టెంబర్ 9 విజయక్రాంతి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్(IPS) మంగళవారం అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించి అనుమానాస్పద కదలికలను,ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలర్టింగ్ ఆఫీసర్లు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూ రాత్రి వేళల్లో పోలీసుల నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
రాత్రి సమయంలో పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల విజిబిలిటీ పెంచాలని ఆదేశించారు.సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను నిరంతరం సమీక్షిస్తూ, సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా కొనసాగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయల్-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు.