మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీలను అరికట్టాలి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీలను అరికట్టాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్(Sultanabad Junior Civil Judge Durgam Ganesh) అన్నారు. శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ” అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ బలవంతంగా భయపెట్టి మోసంతో మనుషులను రవాణా చేయడం, మహిళలు, బాలికలపై లైంగిక దాడులు చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని, విద్యార్థులు ఇలాంటి సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉపాధిపేరుతో మహిళలను అక్రమంగా రవాణా చేసి లైంగిక దోపిడీలకు పాల్పడే ముఠాల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటటున్నారని, ఇలాంటి కేసులకు సంబంధించి నేరస్థులకు ప్రత్యేక కోర్టుల ద్వారా జీవిత ఖైదు విధించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ విద్యపై దృష్టి సారించాలని సూచించారు, మాదక ద్రవ్యాల, గంజాయి సేవించడం, వాటిని సరఫరా చేయడం నేరమని, కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, బాలికల పట్ల లైంగిక దోపిడీ లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జడ్జి గణేష్ మాదక ద్రవ్యాలను అరికడతామని విద్యార్థులచే ప్రమాణం చేయించారు.