గిరిజన సంక్షేమంపై ముఖ్య కార్యదర్శితో ఎమ్మెల్యే...
ఉట్నూర్,సెప్టెంబర్30 ( విజయక్రాంతి ): గిరిజన ప్రాంతంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ హైదరాబాద్లో కలిసి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, మౌలిక వసతులు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బుధవారం ఈ సందర్భంగా దండారి ఉత్సవాలకి సంబంధించి రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
అలాగే ఉట్నూర్, భద్రాచలం డి.ఎడ్., బి.ఎడ్. కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.గిరిజన యువతకు పోటీ పరీక్షల శిక్షణ అందించేలా ఐఏఎస్ అకాడమీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళలు , పురుషులకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.కేస్లాపూర్ నాగోబా జాతర అభివృద్ధి కోసం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసినందుకు, అలాగే రహదారుల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ కు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా గిరిజన, ఆదివాసీ గూడాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపి, అర్హులైన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, విద్యా అవకాశాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.