4 September, 2026 | 9:10 PM

అక్షరమాలతో అమ్మవారికి చీర

04-09-2026 | 08:03pm

నిర్మల్,(విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. చేనేత మగ్గంపై తెలుగు అక్షరమాలతో అద్భుతంగా నేసిన పట్టుచీరను బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి(Basara Sri Gyan Saraswati Ammavari Temple)  సమర్పించారు. సిరిసిల్ల జిల్లా(Sircilla District) కేంద్రం కు వాస్తవ్యులు నల్ల పరంధాములు కుమారుడు, చేనేత కళాకారుడు, కార్మికుడు, నల్ల జగదీష్ ఈ ప్రత్యేక పట్టుచీరను రూపొందించారు. ఆరు మీటర్ల 30 సెంటీమీటర్ల పొడవు, సుమారు 650 గ్రాముల బరువున్న ఈ పట్టుచీరను చేనేత మగ్గంపై 15 రోజుల పాటు కష్టపడి తయారు చేసినట్టు తెలిపారు. ఈ చీరను చదువులమ్మ సరస్వతి అందించాలన్న ఉద్దేశంతో తయారు చేసినట్టు తెలిపారు.

ఈ ప్రత్యేక చీరను మేళతాళాల మధ్య బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆలయ ఈఓ అంజనాదేవి, వేద పండితుల సమక్షంలో సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. తెలుగు అక్షరమాలతో నేసిన పట్టుచీరను అమ్మవారికి సమర్పించడం  ఎంతో గర్వకారణమని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్ర అధ్యక్షులు రాపోలు సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శులు రమణ విశ్వం, జెంటిల్ శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్, ఓని స్వామి, రువ్విపోశెట్టి, మేకల అశోక్, అంకం రమేష్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.