ప్రజల భాగస్వామ్యంతో గ్రామ భద్రతకు సాంకేతిక బలం
- గ్రామ పాలకవర్గం, యువత, ప్రజల చొరవకు అభినందనలు...
- కోనాపూర్ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర గ్రామాలు ముందుకు రావాలి...
- జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర...
బాన్సువాడ, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ (Police station)పరిధిలోని కోనాపూర్ గ్రామంలో గ్రామ పాలకవర్గం, యువత, గ్రామ ప్రజల సమన్వయంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర (SP M. Rajesh Chandra) ప్రారంభించారు. కోనాపూర్ సర్పంచ్ ఎల్లగొని కిష్టవ్వ(Yellagoni Kishtavva), బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డితో (DSP P. Vithal Reddy) కలిసి జిల్లా ఎస్పీ శుక్రవారం సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం కోనాపూర్ గ్రామం తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. పోలీసులతో కలిసి ప్రజలు భద్రతా వ్యవస్థలో భాగస్వాములు కావడం ద్వారా గ్రామాల్లో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమని, ఇది ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సీసీ కెమెరాలు నేరం జరిగిన అనంతరం నిందితులను గుర్తించేందుకు మాత్రమే కాకుండా, నేరాలు జరగకుండా ముందస్తు నిరోధక చర్యగా కూడా కీలకంగా పనిచేస్తాయని ఎస్పీ గారు తెలిపారు.నేరం జరిగిన సందర్భంలో సీసీ కెమెరాల దృశ్యాలు పోలీసులకు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామంలో నిరంతర నిఘా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ప్రజలకు మరింత భద్రతా భరోసా కలుగుతుందని ఎస్పీ గారు తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరికీ సురక్షిత వాతావరణం కల్పించడంలో సాంకేతిక నిఘా వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఇతర గ్రామాల పాలకవర్గాలు, యువత, ప్రజలు కూడా కోనాపూర్ను స్ఫూర్తిగా తీసుకుని తమ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు–పోలీసుల సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర నిఘా కలిసినప్పుడే గ్రామాల భద్రత మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, బాన్సువాడ ఎస్హెచ్ఓ శ్రీధర్, రాజా గౌడ్,గ్రామ పాలకవర్గ సభ్యులు, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.