పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
కరీంనగర్,(విజయక్రాంతి): ఈనెల 27న పర్యాటక దినోత్సవం(Tourism Day) పురస్కరించుకొని జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే(Additional Collector Ashwini Tanaji Wakade) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో తన చాంబర్ లో డీవైఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి, ఈ కార్యక్రమ నోడల్ ఆఫీసర్ తిరుపతి రావు, టూరిజం ఏఈ జీవన్ రెడ్డి తో పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న ఎల్ఎండీ డ్యాం, బస్టాండ్ ఎదుట ఉన్న మ్యూజియంను విద్యార్థులు సందర్శించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మన జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రాంతాల చరిత్ర, వాటి ఫోటోలు, క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేసి విద్యార్థులకు వివరించాలన్నారు.
పర్యాటక ప్రాంతాల హోర్డింగులు ఏర్పాటు చేయాలి
పర్యాటక ప్రాంతాల వద్ద వద్ద కనీస సౌకర్యాలు కల్పించడం తోపాటు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పర్యాటక ప్రాంతాల సమాచారం, ఫోటోలతో కూడిన హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యాటక, చారిత్రక ప్రదేశాలపై విద్యార్థులకు ముందస్తుగా వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.