సింగ్ గీతం ఇక స్వర్గంలో..

04-10-2026 | 05:25am

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాల మాంత్రికుడిగా పేరుగాంచిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Director Singeetam Srinivasa Rao) (94) కన్నుమూశారు. వయోభారంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్, నిర్మాత, నటుడు, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారాయన.

94 ఏళ్ల వయసులో కూడా ‘సింగ్ గీతం’ (2026) చిత్రానికి దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే అత్యధిక వయసులో మెగాఫోన్ పట్టిన రెండో దర్శకుడిగా రికార్డు సృష్టించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. రొటీన్ కథలకు భిన్నంగా సరికొత్త ఆలోచనలతో సరిహద్దులు దాటి ప్రయోగాలు చేయడం ఆయన శైలి. 

చదువు.. కుటుంబ నేపథ్యం.. 

సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సంప్రదా య కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. తల్లి వయోలిన్ వాద్యకళలో నిపుణురాలు. సింగీతం శ్రీనివాసరావు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. ఆ సమయంలోనే హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటరంగం ప్రవేశం చేశారు. కాలేజీ రోజుల్లోనే హాలీవుడు సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరిచేవారు.

డిగ్రీ తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. బ్రహ్మ, అంత్యఘట్టం నాటకాలను ఆయనే స్వయంగా రాసి తన విద్యార్థులతో ప్రదర్శింపజేశారు. రవీనాథ్ ఠాగూర్ రాసిన ‘చిత్ర’ను ‘చిత్రార్జున నాటకం గా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ నాటక ప్రదర్శనను జవహర్‌లాల్ నెహ్రూ తిలకించారు. ‘తెలుగు స్వతంత్ర’ అనే పత్రికలో కొంతకాలం రచనలు చేశారు సింగీతం. 

సతీమణి పేరుపై పుస్తక రచన.. 

1960లో లక్ష్మీకళ్యాణిని వివాహం చేసుకున్నారు. 2022, మే 28న ఆమె కాలం చేశారు. స్క్రిప్ట్ రచనలో సింగీతం శ్రీనివాసరావుకు తోడ్పడుతూ కీలక పాత్ర పోషించేవారు లక్ష్మీకళ్యాణి. సింగీతం 2012లో తన సతీమణి పేరుతో ‘శ్రీకళ్యాణీయం’ అనే ఒక పుస్తకాన్ని రాశారు.  

కేవీరెడ్డి శిష్యరికం కోసం వెంటపడి.. 

సినిమా రంగమే తన జీవిత ప్రధాన ధ్యేయంగా ఎంచుకున్న శ్రీనివాసరావు పట్టువదలని విక్రమార్కుడిలా సుప్రసిద్ధ దర్శకుడు కేవీరెడ్డి వద్ద శిష్యుడిగా చేరారు. వెంటబడి మరీ కేవీరెడ్డి వద్ద శిష్యరికం ప్రారంభించిన శ్రీనివాసరావు ఆల్ టైమ్ క్లాసిక్ ‘మాయాబజార్’ చిత్రంతో ఆయన అనుచరుడిగా పనిచేశారు. ‘జగదేకవీరుని కథ’ (1961) సినిమాకూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. యూఆర్ అనంతమూర్తి నవల ఆధారంగా పట్టాభి రామిరెడ్డి కన్నడంలో ‘సంస్కార’ సినిమాను రూపొందించాలని సంకల్పించిప్పుడు శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్నారు.

ఆ తర్వాత సింగీతం ప్రయోగాల పరంపర కొనసాగుతూ వచ్చింది. ‘నీతి నిజాయితీ’ అనే తెలుగు సినిమా ద్వారా దర్శకుడిగా 1972లో సింగీతం శ్రీనివాసరావు పూర్తిస్థాయి దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ముఖ్యంగా కమల్‌హాసన్‌ను హీరోగా పెట్టి సింగీతం తీసిన తొలి సినిమా ‘సొమ్మొకడిది సోకొకడిది’. కమల్‌హాసన్‌తో కలిసి శ్రీనివాసరావు తీసిన సినిమాల్లో ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అమావాస్య చంద్రుడు’, ‘అపూర్వ సోదరులు’ చెప్పుకోదగ్గవి. 

ప్రయోగం అంటేనే సింగీతం.. 

సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక సినిమాలు రూపొందించడంలో రారాజు. ఒక్కమాటలో చెప్పాలంటే, సింగీతం అంటేనే ప్రయోగం. అప్పటివరకు ఉన్న ఫార్ములా సినిమాలకు భిన్నంగా సరికొత్త జోనర్లను ప్రేక్షకులకు పరిచయం చేశారాయన. సినిమాకు సంబంధించిన అన్ని అంశాల్లో పూర్తి అవగాహన కలిగిన దర్శకుడిగా పేరుగాంచిన ఆయన తీసిన సందేశాత్మక సినిమాల్లో ‘తరం మారింది’ ముఖ్యమైనది.

టాకీ యుగంలో ఆయన డైలాగులు లేకుండా నిశ్శబ్ద హాస్య చిత్రం ‘పుష్పక విమానం’ తీసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కేవలం నటీనటుల హావభావాలు, బాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే కథను నడిపించిన తీరుకు గాను ఆయనను జాతీయ అవార్డు వరించింది. ఈ సినిమా అన్ని భాషల్లో ప్రదర్శితమైంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ చిత్రం ‘ఆదిత్య 369’ (1991) ఆయన రికార్డుల్లో మరొకటి.

టాలీవుడ్‌కు టైమ్ ట్రావెల్ అనే ఈ సైన్స్ ఫిక్షన్ కాన్సెఫ్ట్‌ను పరిచయం చేసిన తొలి మార్గదర్శక చిత్రమిది. శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లి రావడం అనే కథాంశంతో ఇప్పటికీ ఈ సినిమా ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయింది. సింగీతం 1989లో కమల్ హాసన్‌ను మరుగుజ్జుగా చూపిస్తూ చేసిన అద్భుత సాంకేతిక మాయాజాలం ‘అపూర్వ సగోధరర్గళ్’ (తెలుగులో ‘విచిత్ర సోదరులు’) ఆయన ప్రతిభకు ప్రతిరూపం.

ఆధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏమాత్రం లేని ఆ రోజుల్లోనే కేవలం కెమెరా లెన్స్ ట్రిక్స్, ప్రత్యేకమైన సెట్టింగ్స్‌తో కమల్‌హాసన్‌ను మరుగుజ్జు పాత్రలో చూపించి ప్రేక్షక లోకాన్ని విస్మయపరిచారు. అంతేకాదు కమల్‌హాసన్ చతుర్పాత్రాభినయంతో సాగే క్లాసిక్ కామెడీ చిత్రం ఇంకా ‘మైఖేల్ మదన కామరాజు’ (1990) సింగీతం చిత్ర రాజాల్లోనిదే. ఇంకా అద్భుతమైన జానపద కథాంశంతో సింగీతం రూపొందించిన ‘భైరవద్వీపం’ (1994) ఆయన మలిచిన సాహసోపేత దృశ్యకావ్యం.

అంతరించిపోతున్న జానపద చిత్రాల జోనర్‌కు సరికొత్త సాంకేతిక సొబగులు అద్దిన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దిన చిత్రమే ఈ ‘భైరవ ద్వీపం’. ‘మయూరి’ (1984) సినిమాలో సుధా చంద్రన్ చరిత్రను ఎన్నో సున్నితంగా తెరకెక్కించారు. ప్రమాదంలో కాలు కోల్పోయినా కృత్రిమ కాలితో తిరిగి నృత్యకళాకారిణిగా రాణించిన సుధా చంద్రన్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో 14 నంది అవార్డులను కైవసం చేసుకుంది. 

విభిన్న నైపుణ్యాల సమాహారం.. 

సింగీతం కేవలం దర్శకుడిగానే కాకుండా సినీ రంగానికి సంబంధించిన బహుముఖ ప్రజ్ఞను చాటారు. సంగీత దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయిగా, నటుడిగా, నిర్మాతగానూ సినీచరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖింపజేశారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు సాలూరి రాజేశ్వరరావు శిష్యుడైన ఆయన, కన్నడంలో రాజ్‌కుమార్ నటించిన ‘భాగ్యద లక్ష్మి బారమ్మ’, ‘సంయుక్త’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తను తీసే సినిమాలకు స్క్రీన్‌ప్లే రాయడమే కాకుండా, విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘కంచె’ (2015), గుణశేఖర్ చిత్రం ‘వరుడు’ (2010) వంటి సినిమాల్లో నటుడిగానూ కనిపించి అలరించారు. 

సినీ దిగ్గజాలతో అనుబంధం.. 

ఎందరో సినీ దిగ్గజాలతో సింగీతం శ్రీనివాసరావుకు అనుబంధం ఉంది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో వరుసగా ఏడు హిట్ చిత్రాలను నిర్మించిన సింగీతం కన్నడ సినీ పరిశ్రమలోనూ చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా నటుడు కమల్ హాసన్‌తో ఆయనకున్న అనుబంధం విడదీయరానిది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలెన్నో క్లాసిక్ కామెడీలుగా నిలిచాయి. అంతేకాదు కమల్ హాసన్ తీవ్రమైన హేతువాది, నాస్తికుడు.

సింగీతంకి, కమల్‌కు మధ్య ఉన్న దృక్పథాల సామీప్యత వల్లే వారిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన, ఆలోచింపజేసే వ్యంగ్య ప్రధాన చిత్రాలు వచ్చాయి. సాంప్రదాయ చట్రంలో ఇరుక్కుపోకుండా సరికొత్త ఆలోచనలను ఆహ్వానించే గుణం ఉండబట్టే, ఆయన ఎప్పుడూ యువతతో, మారుతున్న కాలంతో సమానంగా ప్రయాణించగలిగారు. చివరి శ్వాస వరకు మనస్సులో ఎలాంటి మూఢభావాలు లేకుండా, నిరంతరం సరికొత్త ప్రయోగాలు చేస్తూ, సామాజిక స్పృహతో బతికిన సింగీతం.. నిజంగానే ఒక అరుదైన మార్గదర్శకుడు. 

94 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం..

సినిమాపై సింగీతం శ్రీనివాసరావుకు ఉన్న మక్కువ ఎంతటిదంటే, వృద్ధాప్యంలోనూ ఆయన మేగాఫోన్ పట్టడం ఆపలేదు. ఇదే ఏడాది యువ దర్శకుడు నాగ్‌అశ్విన్ సమర్పణలో, వైజయంతి మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ‘సింగ్ గీతం’ సినిమాకు 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే అత్యధిక వయసులో సినిమా తీసిన అతి కొద్ది మంది దర్శకులలో ఒకరిగా నిలిచారు. ఈ చిత్రంలో పాత్రల సంభాషణలన్నీ కేవలం పాటల రూపంలోనే సాగడం ఆయన సృజనాత్మకతకు మరో నిదర్శనం.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కించిన ఈ మ్యూజికల్ ఫాంటసీ చిత్రమే సింగీతం చివరిగా దర్శకత్వం వహించినది. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి తనను వెంటాడుతున్న పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆయన పరితపించిన తీరును యావత్తు సినీప్రపంచం ప్రశంసించింది. ఈ సినిమా కోసం ఆయన 94 ఏళ్ల వయసులోనూ మెగాఫోన్ పట్టి తన అంకితభావాన్ని చాటారు. 

ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం.. 

ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సరికొత్త ప్రయోగాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహోన్నత దర్శకుడు సింగీతం. ఆయన జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. 

రాహుకాలంలో షూటింగ్..

దర్శకత్వంలోనే కాదు, తన వ్యక్తిత్వంలోనూ, ఆలోచనా విధానంలోనూ చాంధస భావాలు, మూఢనమ్మకాలు లేని ఒక సంపూర్ణ హేతువాది, ఆధునిక మానవతావాది సింగీతం శ్రీనివాసరావు. సినిమా రంగంలో సాంప్రదాయాలు, సెంటిమెంట్లు, ముహూర్తాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ, సింగీతం వీటన్నిటికీ దూరంగా ఉంటూ, కేవలం తన ప్రతిభను, శాస్త్రీయ దృక్పథాన్ని నమ్ముకుని జీవించారు. ఇటీవలే 94 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూసే వరకు కూడా ఇదే వైఖరిని కొనసాగించారు.

సినిమా పరిశ్రమలో ఏ చిన్న పని ప్రారంభించాలన్నా శుభ ముహూర్తాలు చూస్తారు, రాహుకాలాన్ని పూర్తిగా వర్జిస్తారు. కానీ సింగీతం వీటికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఆయనకు కథ, నటీనటుల డేట్స్, లైటింగ్ సరిగ్గా ఉండటమే ముహూర్తం. చాలామంది దర్శకులు నిర్దిష్ట సంఖ్య (లక్కీ నంబర్)లను లేదా సెంటిమెంట్లను నమ్ముకుంటారు, కానీ ఆయన కేవలం స్క్రిప్ట్ బలాన్ని, సాంకేతికతను మాత్రమే నమ్మిన ‘సెల్యులాయిడ్ సైంటిస్ట్’.

సమాజంలోని మూఢనమ్మకాలు, కపట భక్తి, మనుషుల ద్వంద్వ ప్రవృత్తులపై ఆయన పెన్నుతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన రాసిన ‘క రాజు’ కథలు అనే పుస్తకంలో సమాజంలోని మూఢత్వాన్ని, చాంధస పోకడలను హాస్యభరితంగా, సునిశితంగా విమర్శించారు. జీవిత సత్యాలను ఎంతో తేలికైన మాటల్లో, హేతుబద్ధంగా వివరించడం ఆయన ప్రత్యేకత. సినిమాల్లో హేతుబద్ధత పాటించారు. జానపద, ఫాంటసీ చిత్రాలు తీసినప్పటికీ ఆయన వాటిలో చాంధసత్వాన్ని చొప్పించలేదు.

‘భైరవద్వీపం’ అనే ఒక జానపద కథను తీసుకున్నప్పటికీ, దానికి క్షుద్రపూజల నేపథ్యం కంటే మానవ ప్రయత్నం, ప్రేమ, సాహసాలకు ఎక్కువ పీట వేశారు. భూత, భవిష్యత్ కాలాల గురించి పురాణాల కోణంలో కాకుండా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ (టైమ్ మెషీన్) కోణంలో ‘ఆదిత్య 369’ సినిమాను హేతుబద్ధంగా రూపొందించారు. ఇక ఆయన చివరి చిత్రం 

‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ మ్యూజికల్ అయినప్పటికీ, దాని కథాంశం పర్యావరణ పరిరక్షణ చుట్టూ సాగుతుంది. సమాజానికి ఉపయోగపడే ఆధునిక సందేశాన్ని ఇవ్వడానికే ఆయన మొగ్గు చూపారు. సమాజంలో ఒకప్పుడు శారీరక వైకల్యాన్ని లేదా అంగవైకల్యాన్ని పూర్వజన్మ పాపంగా చూసే చాంధస భావన ఉండేది.

ఆ మూఢనమ్మకాన్ని బద్దలు కొడుతూ ఆయన ‘మయూరి’ సినిమా తీశారు. ఈ చిత్రం ద్వారా మనిషి సంకల్పం ముందు ఏదీ అసాధ్యం కాదని నిరూపించారు. విధిని నమ్మడం కంటే స్వశక్తిని నమ్మాలనే హేతువాద ఆలోచనకు ఈ సినిమా ఒక నిదర్శనం. 

మరిన్ని వార్తలు