రైతుల సహకారంతోనే సంఘం బలోపేతం
మహా జనసభలో ఎర్రవరం పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాస్
కోదాడ సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) మహా జనసభను చైర్మన్ నలజాల శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆరు నెలల ఆదాయ, వ్యయ వివరాలను సీఈవో సభ్యులకు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఘం రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. సంఘం లాభాల బాటలో ముందుకు సాగుతోందన్నారు.
రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ నలజాల శ్రీనివాస్ కోరారు. సంఘం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న లాకర్ సౌకర్యాన్ని రైతులు, సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు మరిన్ని సేవలు అందించేలా సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిక్యా తండాలోని ధాన్యం గోదాం అభివృద్ధికి గతంలో సహకరించిన దాతల పేర్లను ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ నలజాల శ్రీనివాస్ మహా జనసభలో ప్రకటించారు.
రైతులు, దాతలు అందిస్తున్న సహకారాన్ని గుర్తిస్తూ వారి సేవలను గౌరవిస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఎర్రవరం సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు, బిక్యా తండా సర్పంచ్ ఝాన్సీ బాలాజీ, రామలక్ష్మీపురం సర్పంచ్ గంగిరెడ్డి తులసి కన్నారెడ్డి, ఇన్‌చార్జి కార్యదర్శి షేక్ మౌలాలి, ఉపాధ్యక్షుడు కొప్పుల సుభాష్‌రెడ్డి, డైరెక్టర్లు యడ్లవల్లి వెంకటేశ్వర్లు, మండాది శ్రీను, బాదిన శ్రీను, వల్లేపు సుదర్శన్, సూరేపల్లి మంగమ్మ, అన్నెం రవీందర్‌రెడ్డి, పాముల ఆశీర్వాదం, గజ్జి ఎలిశమ్మ, వాంకుడోత్ సైదులు, బానోతు నాన్‌రాజ్, గూగులోతు రవి తదితరులు పాల్గొన్నారు. రైతులు, గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.