పుష్కరాలకు నిరంతర విద్యుత్ సరఫరా
మంథనిలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశం
మంథని,(విజయక్రాంతి): గోదావరి పుష్కరాలు–2027(Godavari Pushkarams)ను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ల(Pushkaram Ghats) వద్ద భక్తులకు విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి(TG NPDCL CMD Karnati Varun Reddy) అధికారులను ఆదేశించారు. బుధవారం మంథని గోదావరి పుష్కర ఘాట్‌ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పుష్కరాల సమయంలో భక్తులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా పరిస్థితి, మౌలిక వసతులపై అధికారులతో సమీక్షించారు.
అనంతరం దుబ్బపల్లిలో ఇటీవల ఛార్జ్ చేసిన ఎస్‌హెచ్‌జీ సోలార్ ప్లాంట్‌ను సీఎండీ పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ పనితీరు, గ్రిడ్ అనుసంధానం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్లాంట్ నిర్వహణలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పరిశీలనలో పెద్దపల్లి ఎస్‌ఈ (ఆపరేషన్స్) వడ్లకొండ గంగాధర్, మంథని డీఈ, ప్రభాకర్, ఏడీఈ, ఏఈ తదితర అధికారులు పాల్గొన్నారు.