కార్మికులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కార్మికులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు(Sultanabad CI Ranjith Rao), ఎస్సై చంద్రకుమార్ లు తెలిపారు... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో సోమవారం రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు రోడ్డు భద్రత, గంజాయి వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైస్ మిల్ సూపర్ వైజర్లు, యాజమాన్యాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకపోవడం, రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండడం వంటి అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు.
అలాగే మద్యం సేవించి లేదా గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకుని వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం మరియు చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు. ఎవరూ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండి సురక్షిత సమాజ నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. అదేవిధంగా రైస్ మిల్ సూపర్వైజర్లు మరియు యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు రోడ్డు భద్రతా నియమాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై నిరంతరం అవగాహన కల్పించాలని పోలీసులు కోరారు. సురక్షితమైన ప్రయాణం – ప్రమాదరహిత సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు ఎస్ఐ చంద్ర కుమారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
