కుంటెల్లి రాజమల్లయ్య జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

16-10-2026 | 12:54pm

క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదలను పెంపొందిస్తాయి: చల్మెడ లక్ష్మీ నరసింహారావు

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) కోనరావుపేట మండలం సుద్దాల గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు తన తాతగారు కుంటెల్లి రాజమల్లయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను బీఆర్ఎస్ పార్టీ(BRS party) వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీల నిర్వహణతో యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు.

ఇలాంటి టోర్నమెంట్లు యువతలో స్నేహభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించడంతో పాటు క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కుంటెల్లి రాజమల్లయ్య జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్(Volleyball Tournament) నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాల్లో క్రీడల అభివృద్ధికి గ్రామస్థులు, యువత సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచులు స్వామి దాసు, జిన్న అనూష-అనిల్, మల్లేష్, వెంకటేష్, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి, చంద్రయ్య గౌడ్, భూమారెడ్డి, మహేష్, పరశురామ్, సింగం ప్రసాద్, సుమన్, శివతేజ, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు