ఎల్నినో ప్రభావాలు తగ్గి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
కుటుంబ సమేతంగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
అలంపూర్: ఎల్నినో ప్రభావాలు తగ్గి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vaviti Srihari) ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం కుటుంబ సమేతంగా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని(Sri Jogulamba Balabrahmeswara Swamy Temple) సందర్శించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా బాల బ్రహ్మేశ్వర స్వామి(Bala Brahmeswara Swamy)ని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు ప్రసాదం, శేషవస్త్రాన్ని అందజేసి ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారు మరింత శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని కోరినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావాలు తగ్గి అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత, ఏఐసీసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆలయ ఈవో దీప్తి, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.