గురుకులాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

19-09-2026 | 09:16pm

కామన్ డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ హైమావతి

కొండపాక, సెప్టెంబర్ 19:( విజయ క్రాంతి) అన్ని గురుకులాల్లో వంటశాల, డైనింగ్ హాల్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు కామన్ డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి(District Collector K. Haimavati) అధికారులను ఆదేశించారు. శనివారం కొండపాక మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం, బెండకాయ ఫ్రై, పప్పు, సాంబారు, పెరుగు, గుడ్ల నాణ్యతను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత బాగుందని, ప్రతిరోజూ ఇదే విధంగా అందించాలని వంట సిబ్బందికి సూచించారు.

స్టోర్ రూమ్‌లోని వంట సరుకులను పరిశీలించి నాణ్యమైన సరుకులనే వినియోగించాలని, విద్యార్థుల మెస్ కమిటీ సమక్షంలోనే వంట సిబ్బందికి సరుకులు అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంతోపాటు పాఠశాల పరిసరాలు, వంటశాల, విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సమర్థవంతంగా అందించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు