సీసీటీవీ కెమెరాలతో ప్రజలకు అదనపు రక్షణ
- సీపీ రష్మీ పెరుమాళ్
- జిల్లావ్యాప్తంగా ఒకేరోజు 310 ప్రారంభం
సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): సీసీటీవీ కెమెరాలతో ప్రజలకు అదనపు రక్షణ లభిస్తుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Siddipet CP Rashmi Perumal) అన్నారు. ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 310 సీసీటీవీ కెమెరాలను ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ఘనంగా ప్రారంభించారు. సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామంలో మంద బూదవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్(Manda Boodavva Lakshmareddy Foundation) సహకారంతో ఏర్పాటు చేసిన 20 సీసీటీవీ కెమెరాలను రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ తమ ఇళ్ళు, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఖమ్మంపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన మంద బూదవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ మంద భాస్కర్ రెడ్డికి పోలీస్ కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ మొగిలి పాల్గొన్నారు.