అభివృద్ధి క్రెడిట్ కోసమే బీఆర్ఎస్ డ్రామాలు!

13-10-2026 | 03:17pm

అశ్వాపురం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) కృషితో జరుగుతున్న అభివృద్ధి పనుల క్రెడిట్‌ను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు విమర్శించారు.

ఎమ్మెల్యే చొరవతో రోడ్లు, వంతెనల నిర్మాణానికి హెచ్ఏఎం కింద రూ.186 కోట్లు, పినపాక పట్టినగర్ నుంచి రాజుపేట వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణకు రూ.76 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మారెళ్లపాడు ప్రాజెక్టుకు గత పాలకులు కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే, తమ ఎమ్మెల్యే పట్టుదలతో పూర్తి చేయించి తుమ్మల చెరువును నింపారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందాల వల్లే రోడ్లు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు ముందుకు సాగుతుండటంతో వాటిని తమ పోరాట ఫలితంగా చెప్పుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనల పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

వారి అసత్య ప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు వాస్తవాలతో తిప్పికొట్టాలని, మంజూరైన నిధులు, టెండర్ల వివరాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రాజకీయ డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని, పినపాక అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు