"సర్" హియరింగ్ వేగవంతం చేయాలి: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం తాహసిల్దార్ కార్యాలయంలో హియరింగ్ సరళిని, ఓటర్ల ధ్రువపత్రాలు పరిశీలించి నేరుగా మాట్లాడిన జిల్లా కలెక్టర్
పాల్వంచ ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): "సర్" ప్రక్రియలో ఓటు కోల్పోయిన ఓటర్లకు నోటీసులు స్వీకరిస్తున్న హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం తాహసిల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా సందర్శించి హియరింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఓటు కోల్పోయిన వారికి బి.ఎల్.ఓలు నేరుగా అందజేసిన నోటీసులకు సరైన ధ్రువపత్రాలను తాహసిల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చిన అర్హులైన ఓటర్లతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడారు. నోటీసులు ఇంటికి ఎవరు తీసుకొచ్చారని.. ఎన్ని రోజుల క్రితం నోటీసులు మీకు అందాయని ఓటర్లతో మాట్లాడారు. సరైన ధ్రువపత్రాలు పత్రాలు తీసుకు వచ్చామని ఓటర్లు కలెక్టర్ కు సమాధానం చెప్పగా, ఆ పత్రాలను స్వయంగా పరిశీలించి బి.ఎల్.ఓ లకు అందజేసి తక్షణమే ఆన్లైన్ ప్రక్రియ సక్రమంగా.. పకడ్బందీగా పొరపాట్లు దొర్లకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసిన కొత్తగూడెం మండలంలోని పీఎంశ్రీ పథకంలో కొనసాగుతున్న కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుండగా ఆరవ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుపై పాఠ్యాంశాల్లో ప్రావీణ్యం ఏ విధంగా ఉంది అని విద్యార్థులతో చదివించి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రణాళిక బద్ధంగా క్రమశిక్షణతో విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఇంగ్లీష్ తో పాటు అన్నీ సబ్జెక్టులల్లో రాణిచేలా కృషి చేయాలని ఉపాధ్యాయుడు హరిబాబుకు సూచించారు.
అదేవిధంగా పాల్వంచ ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా సందర్శించి ప్రజారోగ్య కార్యక్రమాలు సకాలంలో రోగులకు అందించాలని, అందిస్తున్న వైద్య సేవలను, ఆసుపత్రి సూపరిడెంటెంట్ డాక్టర్ ముక్కటేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న మెయిల్ వార్డు, ఫిమేల్ వార్డు ఎమర్జెన్సీ వార్డు, క్యాజువాలిటీ, డయాలసిస్ సెంటర్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆపరేషన్ థియేటర్ లను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో జూలూరుపాడు మండలానికి చెందిన కొంతమంది రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో జిల్లా కలెక్టర్ తో స్వయంగా మాట్లాడారు. జూలూరుపాడు మండలంలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలిస్తానని పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూపరిడెంటెంట్ ఆదేశించారు.