మరమ్మత్తులు లేక శిథిలమై పోతున్న పశువైద్యశాల
ముస్తాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రం(Primary Veterinary Centre) భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. వర్షాలు పడుతున్న ప్రతిసారి భవనం స్లాబ్ లీకై సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం గోడలు తడిచిపోవడంతో గదుల్లో నిల్వ ఉంచిన మందులు పాడవుతున్నాయని, వర్షం వచ్చినప్పుడు ఎప్పుడైనా పెచ్చులు కూలిపోతాయనే భయంతో పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.
ఇక భవనం వెనుక భాగంలోని తలుపు పూర్తిగా ధ్వంసం కావడంతో కోతులు లోపలికి చేరి మందుల సామాగ్రిని చిందరవందర చేస్తున్నాయని చెప్పారు. అదనంగా ఎలుకలు, పాములు సంచరిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో సిబ్బంది, రైతులు భవనం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనానికి తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజల సేవలకు కీలకమైన ఈ కేంద్రాన్ని సురక్షితంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.