ఆదివాసీ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి

26-10-2026 | 02:33pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కొమరం భీమ్ 86వ వర్ధంతితో పాటు ఆదివాసీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు గ్రామగ్రామాన నిర్వహించాలని తుడుం దెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఇల్లెందు కొత్త బస్టాండ్ సమీపంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తుడుం దెబ్బ, ఏఈడబ్ల్యూసీఏ, ఆధార సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు దుగారావు వీరభద్రం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని కాపాడాలని, జీవో నంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకురావాలని, ఎస్టీ జాబితా అంశంపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

సాగులో ఉన్న పోడు భూములకు అర్హులైన ఆదివాసీలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో భూమి, అటవీ హక్కులు, స్వయం పాలన సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుగ్గ రామనాథం, అరేం పాపారావు, వట్టం కన్నయ్య, దనసరి రామమూర్తి, సూర్ణపాక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు