అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు
కామారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన గాంధారి ఎస్‌బీఐ ఏటీఎం(SBI ATM) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ప్రధాన నిందితుడు రషీద్‌ను అరెస్టు చేశారు. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో 15 రోజుల పాటు దర్యాప్తు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. సోమవారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
ఏడు నిమిషాల్లోనే చోరీ
గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం(SBI ATM)లో అక్టోబర్ 10, 11 తేదీల మధ్య అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదుతో ఉన్న ఐదు పెట్టెలను అపహరించారు. ఈ ఘటనలో రూ.25,45,900 నగదు చోరీకి గురైంది. నిందితులు కేవలం ఏడు నిమిషాల్లోనే చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు గాంధారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ(District SP) ఆదేశాలతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకున్నారు.
ఐదు రాష్ట్రాలు దాటి చోరీలు
రాజస్థాన్‌కు చెందిన నలుగురు సభ్యుల ముఠా నల్లరంగు మహీంద్రా స్కార్పియో వాహనంలో తిరుగుతూ తెలంగాణలోని ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కళ్లుగప్పేందుకు వాహనానికి వివిధ నంబర్ల ప్లేట్లు మారుస్తూ చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
2026 సెప్టెంబర్‌లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఎస్‌బీఐ ఏటీఎంల వద్ద కూడా గ్యాస్ కట్టర్ సహాయంతో చోరీలకు పాల్పడినట్లు ప్రధాన నిందితుడి విచారణలో వెల్లడైంది.
అక్టోబర్ 10 రాత్రి తెలంగాణకు వచ్చిన ముఠా గాంధారికి చేరుకునే మార్గంలో ఓ వెల్డింగ్ దుకాణం తాళం పగలగొట్టి ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు ఇతర పరికరాలను అపహరించింది. అనంతరం గాంధారి ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు చేరుకుని ముఖాలను గుర్తించకుండా మాస్కులు, టోపీలు, నైటీలు ధరించి సీసీటీవీ కెమెరాలపై నల్లరంగు పిచికారీ చేసి, గ్యాస్ కట్టర్‌తో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదుతో పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
రాజస్థాన్‌లో నిందితుడి అరెస్టు
చోరీ అనంతరం నిందితులు స్కార్పియో వాహనంలో మహారాష్ట్ర, రాజస్థాన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌లోని చేచాట్ పోలీసులు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వాహనం టైరు దెబ్బతినడంతో నిందితులు దానిని వదిలి నగదు ఉన్న సంచితో పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ప్రత్యేక పోలీసు బృందాలు రాజస్థాన్‌లో గాలింపు చేపట్టి అక్టోబర్ 20న భరత్పూర్ రహదారిపై బస్సు కోసం వేచి ఉన్న రషీద్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కామారెడ్డికి తీసుకొచ్చారు. అక్టోబర్ 21న చేచాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నల్లరంగు మహీంద్రా స్కార్పియోను గుర్తించి అందులోని చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నగదు, వాహనం, మారణాయుధాలు స్వాధీనం
నిందితుడి నుంచి రూ.29,400 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నల్లరంగు మహీంద్రా స్కార్పియో, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్‌కు సంబంధించిన పరికరాలు, రెగ్యులేటర్, పైపులు, ఇనుప రాడ్లు, స్క్రూడ్రైవర్, వివిధ నంబర్ల ప్లేట్లు, మాస్కులు, దుస్తులు, మూడు ఇనుప కత్తులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన రషీద్ (30)ను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు.
పోలీసులకు ఎస్పీ అభినందనలు
అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్, ఐటీ కోర్ ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సీసీఎస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, లక్ష్మీకాంత్, సదాశివనగర్ కానిస్టేబుల్ అజార్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్సారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.