పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు
ములకలపల్లి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగులో శాస్త్రీయ, ఆధునిక పద్ధతులు పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు(District Agriculture Officer Baburao) కోరారు. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి రైతు వేదికలో శుక్రవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ATMA) ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వరిలో సన్న రకాల సాగు, HT ప్రత్తి సాగు యొక్క ప్రతికూల ప్రభావాలు,నానో ఎరువుల వాడకం–ప్రయోజనాలు,ఆయిల్ పామ్,నూనె గింజల సాగు, సమగ్ర వ్యవసాయం,వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగులో శాస్త్రీయ,ఆధునిక పద్ధతులను పాటించాలని సూచించారు.
పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం తదితర అంశాల్లో వ్యవసాయ శాఖ సూచనలను పాటించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చని తెలిపారు.కృషి విజ్ఞాన కేంద్రం కొత్తగూడెం కోఆర్డినేటర్ భరత్ మాట్లాడుతూ రైతులు పంటల వైవిధ్యాన్ని పెంచుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్,నూనె గింజల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా వ్యవసాయంలో స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశాలను వివరించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు రవి కుమార్ మాట్లాడుతూ రైతులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తూ, నానో ఎరువుల వినియోగం,వాటి ప్రయోజనాలు, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాల్సిన విధానాలను వివరించారు. మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అందిస్తున్న సాంకేతిక సూచనలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.