సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్

27-10-2026 | 11:33am

43 వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేవని గుర్తింపు.. డాగ్‌ స్క్వాడ్‌తో విస్తృత సోదాలు

బూర్గంపాడు,(విజయక్రాంతి): అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు సారపాకలోని సుందరయ్యనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌(Cordon and Search Operation) నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 43 వాహనాలను గుర్తించారు.

వాహనాల పత్రాల పరిశీలన

సుందరయ్యనగర్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు సంబంధించి సరైన పత్రాలు లేని 43 వాహనాలను గుర్తించారు. వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్‌కుమార్‌(DSP Satish Kumar) మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

రోడ్డు భద్రతపై అవగాహన

వాహనదారులు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.ఈ ఆపరేషన్‌లో పాల్వంచ సీఐ సతీష్, ఎస్‌ఐలు మేడ ప్రసాద్, నాగ బిక్షం, సురేష్,మధు ప్రసాద్, పోలీసు సిబ్బంది, స్పెషల్‌ పార్టీ సిబ్బంది,డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు సహా సుమారు 50 మంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు