రాజకీయ అరంగేట్రం

05-10-2026 | 05:25am

సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

  1. సర్వజన సనాతన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు
  2. వారణాసి వేదికగా ప్రమాణం
  3. ‘సనాతన మూలాలతో ఆధునిక భారత్’ను 
  4. నిర్మించుకుందామని నినాదం
  5. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన
  6. స్వస్థలం తెలంగాణ.. నాలుగు దశాబ్దాల పాటు ఐపీఎస్‌గా సేవలు

వారణాసి, అక్టోబర్ 4: సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు(Former CBI Director Mannem Nageswara Rao) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి వేదికగా సర్వజన సనాతన పార్టీ (ఎస్‌ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ‘సనాతన మూలాలతో ఆధునిక భారత్’ అంటూ నినదించారు. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన ఆయన ఐపీఎస్ అధికారిగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు శాంతిభద్రతలు, పరిపాలన విభాగాల్లో సేవలందించారు.

దేశం ఆధునిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే తన నాగరిక మూలాలతో కలిసి ఉండాలని బాధ్యతల స్వీకరణ సందర్భంగా నాగేశ్వరరావు అన్నారు. తమ పార్టీ ఏ కులా నికి, ఏ మతానికి వ్యతిరేకం కాదని.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా మని ప్రకటించారు. 

నాలుగు అంశాలే ఎజెండా..

విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, నాగరికత పునరుద్ధరణ అనే నాలుగు మూల స్తంభాలు తమ ఎస్‌ఎస్‌పీ విధానాలని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సనాతనమంటే కేవలం ఒక ఆరాధన విధానం కాదని.. సత్యం, ధర్మం, కర్తవ్యం, కరుణ, న్యాయం, ఆత్మనిగ్రహం, ప్రకృతి, కుటుంబం, సమాజం, ప్రజా సంక్షేమం వంటి విలువలతో కూడిన జీవన విధానమమని ఆయన చెప్పారు. సనాతనాన్ని ఎన్నికల విధానంగా చూడకూడదన్నారు.

సనాతన మూలాలతో ఆధునిక భారత్ నిర్మాణం సాగాలని అభిప్రాయపడ్డారు. దేవాలయను కేవలం పూజా ప్రాంతాలుగా కాకుండా.. భారతీయ నాగరికతకు సజీవ సాక్ష్యాలని, వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. 

కాశీ తన రాజకీయ కేంద్రం..

వారణాసి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగేశ్వరరావు.. త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ‘కాశీ నా రాజకీయ కేంద్ర బిందువు. ఇక నుంచి సనాతన మూలాలను కాపాడుకుండూ ఆధునిక భారత్‌ను నిర్మించుకుందాం. ఏ వర్గానికీ ఎస్‌ఎస్‌పీ వ్యతిరేకం కాదు. సామాజిక విభజనలకు తావులేకుండా అందరి కోసం పనిచేయడం మా ఉద్దేశం’ అని ఆయన స్పష్టంచేశారు. 

ఐపీఎస్‌గా నాలుగు దశాబ్దాలు సేవ..

1986 ఐపీఎస్ అధికారి అయిన మన్నెం నాగేశ్వరరావు.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగంపేట మండలం బూర్ నర్సాపూర్ గ్రామవాసి. దాదాపు 40 ఏండ్ల పాటు సేవలు అందించారు. వివిధ విభాగాల్లో పనిచేశారు. 2018 అక్టోబర్‌లో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 ఫిబ్రవరి వరకు అందులో కొనసాగారు. అంతకు ముందు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 

మరిన్ని వార్తలు