భూత్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
అక్కడికక్కడే ఇద్దరు మృతి
భూత్పూర్: భూత్పూర్(bhoothpur) పట్టణంలోని నేషనల్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(road accident)లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై నాగన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం డైవర్ ఫ్లై ఓవర్ పై నిర్లక్ష్యంగా ఆపడంతో వెనుక నుంచి వస్తున్న కారు అదుపు తప్పి ఆ డీసీఎంను ఢీ కొట్టింది. అనంతరం కారును మరో డీసీఎం వెనుక నుంచి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న రాయలసీమ ప్రాంతంలోని ఆందోని జిల్లా దేవనకొండ మండలం బుర్క్కుంట గ్రామానికి చెందిన హరీష్ గౌడ్ (26), కారును చివరగా ఢీకొన్న డీసీఎం డ్రైవర్ శేఖర్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న హరీష్ గౌడ్ భార్య కళ్యాణికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
