జియో నెట్‌వర్క్ నిల్.. జనం ఫుల్ ఫైర్

19-10-2026 | 12:50pm

ముస్తాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో జియో నెట్‌వర్క్ (Jio Network) సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకుడు బైతి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగల సమయంలో నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో ఆదివారం రాత్రి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై నిరసన తెలిపారని నవీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 650 మంది జియో వినియోగదారులు ఉన్నారని, నెలకు దాదాపు రూ.2 లక్షల వ్యాపారం జరుగుతున్నప్పటికీ సంస్థ నాణ్యమైన సేవలు (Network Services) అందించడం లేదని మండిపడ్డారు.

ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోతుందని, ఫోన్ కాల్స్ కూడా కలవడం లేదని తెలిపారు. పండుగల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందన్నారు. గ్రామంలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు తీసుకుని గ్రామ సమీపంలోని గుట్ట ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత జియో కార్యాలయ అధికారులను సంప్రదించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. సంస్థ అధికారులు వెంటనే స్పందించి మెరుగైన నెట్‌వర్క్ సౌకర్యాలు (Network Connectivity) కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు