ఏడుపాయల్లో మహిషాసురమర్దినిగా వనదుర్గమ్మ

19-10-2026 | 12:53pm

పాపన్నపేట, అక్టోబర్ 19 (విజయక్రాంతి): భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా, దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా, జనమేజయుని సర్పయాగ స్థలిగా ప్రసిద్ధిగాంచిన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం నవమిని పురస్కరించుకొని వనదుర్గామాతను మహిషాసురమర్దిని (Mahishasura Mardini) దేవి రూపంలో అలంకరించారు. మెరూన్ రంగు చీర, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆ తర్వాత సువాసిని పూజ, చండీ హోమం (Chandi Homam) వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రేపు రాజరాజేశ్వరి దేవిగా వనదుర్గమ్మ దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం విజయదశమి సందర్భంగా వనదుర్గామాత రాజరాజేశ్వరి సహిత వనదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వీరేశం, అర్చకులు తెలిపారు.

మరిన్ని వార్తలు