ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలి

19-09-2026 | 04:22pm
  1. ఆసుపత్రికి నిరంతర నీరు, విద్యుత్‌ సరఫరా అందించాలి 
  2. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి 
  3. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో (Government Hospital)రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర మంచినీరు, విద్యుత్‌ సరఫరా ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో (District Collector Rahul Sharma)కలిసి వైద్య, మున్సిపల్‌, మిషన్‌ భగీరథ, జాతీయ రహదారులు, విద్యుత్‌ శాఖ అధికారులతో ఆసుపత్రి మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి ప్రత్యేక మంచినీటి సరఫరా లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై పైప్‌లైన్‌ క్రాసింగ్‌ సమస్యను పరిష్కరించి మిషన్‌ భగీరథ లేదా మున్సిపల్‌ పైప్‌లైన్‌ ద్వారా నీటి సరఫరా కల్పించాలని ఆదేశించారు. నీటి మోటార్ల సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు.

ఆసుపత్రికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌, అవసరమైన చోట అదనపు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు కేబుల్‌ లైన్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రతికూల వాతావరణంలోనూ సరఫరా నిలిచిపోకుండా భూగర్భ కేబుళ్లు లేదా ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్ల ఏర్పాటును పరిశీలించాలని ఆదేశించారు.సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి సమస్యలను గుర్తించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, మున్సిపల్‌ ఈఈ, విద్యుత్‌, మిషన్‌ భగీరథ, జాతీయ రహదారుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు