పోలీస్ అమరవీరుల సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

23-10-2026 | 03:02pm
  1. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 
  2. పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం 
  3. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా నిర్వహణ

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 23 ( విజయక్రాంతి ) : పోలీస్ అమరవీరుల సేవా స్ఫూర్తిని(Spirit of Service of Police Martyrs) యువత ఆదర్శంగా తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతిక పరికరాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యం, ఫింగర్‌ప్రింట్ వ్యవస్థ, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, పనితీరును పోలీస్ అధికారులు వివరించారు. ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్, కార్బైన్, 9 ఎంఎం పిస్టల్ ఆయుధాలను ప్రదర్శించి వాటి గురించి అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే విధానం, దర్యాప్తు ప్రక్రియ, అత్యవసర సమయాల్లో డయల్ 112 ద్వారా పొందగలిగే సేవలను వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు, సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు