వరంగల్‌ విమానాశ్రయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలి

25-09-2026 | 04:35pm

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి ) : తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ(Konda Laxman Bapuji) పేరును వరంగల్‌ విమానాశ్రయానికి పెట్టాలని పద్మశాలి సంఘం(Padmashali Association) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి భీమనాథుని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన బాపూజీ సేవలను చిరస్మరణీయంగా నిలిపేలా కొండా లక్ష్మణ్‌ బాపూజీ విమానాశ్రయంగా నామకరణం చేయాలని కోరారు.

ఈనెల 27న బాపూజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. పదవుల కంటే ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని తన ఆచరణ ద్వారా బాపూజీ చాటిచెప్పారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, అట్టడుగు వర్గాల హక్కుల కోసం బాపూజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడి పేరును విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఆయన సేవలకు తగిన గౌరవం లభిస్తుందని వారు అన్నారు.

మరిన్ని వార్తలు