మంథని డిగ్రీ కళాశాల తరలింపు చారిత్రక తప్పిదం
- 46 ఏళ్ల చరిత్రను కాలరాస్తే ప్రజా ఉద్యమం తప్పదు
- పీజీ కాలేజీ హామీ ఏమైంది? ఉన్న కళాశాలకే ఎసరు పెడతారా
- త్వరలోనే డిగ్రీ కళాశాల సంరక్షణ మండలి ఏర్పాటుకు పిలుపు
- మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షులు కొండెల మారుతి
మంథని, సెప్టెంబర్ 25(విజయక్రాంతి ప్రతినిధి) : మంథని ప్రాంత విద్యా కిరీటమైన 46 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను(Government Degree College) తరలించాలని చూడటం పాలకుల చారిత్రక తప్పిదమని మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షులు కొండెల మారుతి(Kondela Maruti) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాల తరలింపు నిర్ణయం మంథని విద్యా రంగానికి(Manthani Education Sector) ప్రభుత్వం వేస్తున్న పచ్చి ఉరితాడు అని కొండెల మారుతి నిప్పులు చెరిగారు.
రక్తం ధారపోసి సాధించుకున్న ఆస్తి
ఈ సందర్భంగా కొండెల మారుతి మాట్లాడుతూ.. ఈ కళాశాల ఏ ఒక్కరి భిక్షతోనో రాలేదని, విద్యార్థి(Student) లోకం రక్తం ధారపోసి సాధించుకున్న ప్రజా ఆస్తి అని గుర్తుచేశారు. 1979లో మొదలైన ఉద్యమం రెండేళ్లపాటు సాగి, 100 రోజుల నిరాహార దీక్షల త్యాగాల పునాదులపై 1981 నవంబర్ 16న ఈ కళాశాల ఏర్పాటైందని వివరించారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని 2012లో మల్లెపల్లి శివారులో స్వంత స్థలంలో సొంత భవనం సమకూర్చుకుందని, న్యాక్' నుంచి బి గ్రేడ్ సాధించి వేలాది మంది నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేసిందన్నారు.
స్వంత ఆస్తిని ఎవరి కోసం వదిలేస్తున్నారు
సకల సౌకర్యాలు, విశాలమైన క్యాంపస్ ఉన్న కళాశాలను ఇక్కడి నుంచి తరలించాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని కొండెల మారుతి ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో బయటపెట్టాలని నిలదీశారు. ప్రస్తుత సువిశాల క్యాంపస్‌ను ఖాళీ చేస్తే, ఆ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు, సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా మారే ప్రమాదముందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పీజీ హామీ గాల్లోకి.. ఉన్న డిగ్రీకే ఎసరు
గతంలో మంథని పర్యటన సందర్భంగా డిగ్రీతో పాటు పీజీ కళాశాల తెస్తామని ఇచ్చిన హామీలు ఏ గాల్లో కలిశాయని మారుతి ఎద్దేవా చేశారు. పీజీ కాలేజీ తేకపోగా, ఉన్న డిగ్రీ కళాశాలకే ఎసరు పెట్టి ఇక్కడి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టాలని చూడటం సిగ్గుచేటన్నారు.
కళాశాల సంరక్షణ మండలి’తో సమరశంఖం
కళాశాల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా త్వరలోనే ‘డిగ్రీ కళాశాల సంరక్షణ మండలి’ని ఏర్పాటు చేస్తున్నట్లు కొండెల మారుతి ప్రకటించారు. పూర్వ విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాలు, ప్రజలను కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ తుగ్లక్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే 1979 నాటి పోరాటాన్ని మించి తీవ్రస్థాయి ప్రజా ఉద్యమం నిర్మిస్తామని, కళాశాల రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని కొండెల మారుతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.