కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల....
ఖమ్మం, విజయ క్రాంతి: గత రెండు రోజులు నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు(collectors) అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఆదేశించారు. ఈరోజు సాయంత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల హైదరాబాదు నుండి చరవాణి ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం వాటి వివరాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి తో పాటు ఇతర అంశాలపై అడిగి తెలుసుకుని మంత్రి తుమ్మల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాగులు వంకలు, పొంగి పొరలే అవకాశమున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల తెలిపారు.