దసరా నుంచి ఓపీ!
- వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
- 20 నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభం
- డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
- ఉత్తర తెలంగాణ ప్రజలకు అందనున్న అత్యాధునిక వైద్యం
- రూ.1,371 కోట్లతో 24 అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన
వరంగల్ (మహబూబాబాద్), అక్టోబర్ 15 (విజయక్రాంతి): వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి(Warangal Super Specialty Hospital) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. దసరా పండగ సందర్భంగా ఓపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ మేరకు గురువారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గురువారం ప్రకటిం చారు. ఆసుపత్రి పనులను మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ బలరాం నాయక్, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే. ఆర్ నాగరాజు, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరాకు ఓపీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.
నవంబర్ నెలాఖరు లేదంటే డిసెంబర్ 15 వరకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ఆస్పత్రిని సందర్శిస్తారని ఆయన వెల్లడించారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలతోపాటు, ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కాగా, రూ.1,371 కోట్ల అంచనా వ్యయంతో 24 అంతస్తుల్లో ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ ఆస్పత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తున్న అనేక మంది రోగులకు వరంగల్లోనే మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. ముందుగా ఆస్పత్రిలో ఓపీ సేవలను ప్రారంభించడంతోపాటు దశలవారీగా ఇతర వైద్య విభాగాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.