కబ్జాదారుల కబంధహస్తాల్లో ప్రభుత్వ భూములు
- బాన్సువాడలో యథేచ్ఛగా ఆక్రమణలు
- అధికారుల మౌనం వెనుక ఆంతర్యమేంటి.?
బాన్సువాడ, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములు(Government lands) యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో సుమారు 10 శాతం వరకు ఆక్రమణలకు గురవుతున్నా.. సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులు(municipal officials) ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే మౌనం వహించడంపై పట్టణ ప్రజల్లో చర్చ జరుగుతోంది.
కళ్లముందే కబ్జాలు.. చర్యలు మాత్రం శూన్యం
పట్టణంలో భూముల విలువ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారుల(encroachers) కన్ను పడుతున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను కొందరు ఆక్రమించి నిర్మాణాలు(Encroachment and construction) చేపడుతున్నా, మరికొందరు హద్దులు మార్చి తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలపై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు..
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కబ్జాదారులకు కలిసొస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినా సర్వేలు, హద్దుల నిర్ధారణ, ఆక్రమణల తొలగింపు వంటి చర్యలు ఎందుకు చేపట్టడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి కారణం ఏమిటి? కబ్జాదారుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే చర్చ ప్రజల్లో సాగుతోంది.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందే..
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి. వాటిని పరిరక్షించడం అధికారుల బాధ్యత. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులను గుర్తించి, ఆక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు విఫలమైతే.. భవిష్యత్తులో విలువైన ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.