పోక్సో కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్ష
రూ.5 వేల జరిమానా
తాడ్వాయి,(విజయక్రాంతి): ఫోక్సో కేసు(POCSO Case)లో ఓ నిందితుడికి 15 ఏళ్ల కఠిన గారాగార శిక్ష,రూ.5 వేలు జరిమానాను విధిస్తూ కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు(Kamareddy Fast Track Special Court) న్యాయమూర్తి ముక్తిదా శుక్రవారం తీర్పు వెలువరించినట్లు తాడువాయి ఎస్ఐ నరేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన మంగలి చిన్న గంగాధర్ (49) అనే వ్యక్తి 2022 జూన్ 12న ఇంటి పక్కన ఆడుకుంటున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారిపై చాక్లెట్ల ఆశ చూపి, మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి లైంగికంగా దాడి చేశారు.
చిన్నారి తండ్రి కూలీ పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. అక్కడే తన కుమార్తె కడుపునొప్పి అంటూ ఏడుస్తూ కనిపించింది. ఈ విషయమై తండ్రి కుమార్తెను అడగగా జరిగిన విషయాన్ని భయపడుతూ తండ్రికి వివరించింది. వెంటనే తాడువాయి పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేయగా గంగాధర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. పోలీసులు గంగాధర్ ను అరెస్టు చేశారు. అప్పటినుంచి విచారణ కొనసాగింది నేరారోపణలు నిర్ధారణ అయినందున ఆయనకు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్సై వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ... చిన్నారులపై దారుణాలకు, అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు వెలువడిన తీర్పు తో ఎంతటి వారైనా తప్పించుకోలేరని నిరూపితమైందని వివరించారు. చిన్నారుల భద్రత రక్షణ మన ప్రథమ కర్తవ్యమన్నారు.నేరాలకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ కేస్ లో బాధితురాలికి న్యాయం జరిగేలా అప్పటి పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అప్పటి ఎస్సై ఆంజనేయులు,డి.ఎస్.పి శ్రీనివాసులు,ప్రస్తుత ఎస్సై నరేష్,డిఎస్పి శ్రీనివాసరావులను ఆయన అభినందించారు.