కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. డాక్టర్లు ఎలా తీశారంటే?

06-11-2026 | 11:36am

ఎండోస్కోపీతో అరుదైన చికిత్స.. రోగి కడుపులో నుంచి బ్రష్ తొలగింపు!

నవీ ముంబై: ప్రమాదవశాత్తు టూత్ బ్రష్ మింగేసిన ఓ వ్యక్తికి నవీ ముంబైలోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు(Navi Mumbai Doctors) అరుదైన చికిత్స అందించారు. కడుపులో అడ్డంగా చిక్కుకున్న బ్రష్‌ను ఎలాంటి Surgery లేకుండా Endoscopy ద్వారా బయటకు తీశారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ Procedure విజయవంతమైంది. శారీరక వైకల్యంతో జీవిస్తున్న రాజేంద్ర మాలుసారే తొలుత స్థానిక వైద్యుడిని సంప్రదించారు. ఎక్స్‌రే తీసినా అందులో టూత్ బ్రష్ కనిపించలేదు. దీంతో మెరుగైన పరీక్షల కోసం ఆయనను మెడికవర్ ఆసుపత్రికి పంపించారు. ఘటన జరిగిన మూడు నుంచి నాలుగు గంటల తర్వాత ఆసుపత్రికి చేరుకున్న ఆయనకు స్వల్ప కడుపునొప్పి ఉంది. వైద్యులు Endoscopy చేయగా.. కడుపులో టూత్ బ్రష్ అడ్డంగా ఉన్నట్లు గుర్తించారు.

వైద్యులకు ఎదురైన సవాల్..

బ్రష్ పొడవుగా, గట్టిగా ఉండటంతో జీర్ణవ్యవస్థలోని సహజ మలుపుల గుండా బయటకు తీయడం కష్టంగా మారింది. ఎండోస్కోప్‌కు అమర్చిన ప్రత్యేక Hood సాయంతో బ్రష్‌ ఒక చివరను పట్టుకుని బయటకు లాగేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే కడుపు, ఆహారనాళం కలిసే ప్రాంతం (Gastroesophageal Junction) వద్ద అది ఇరుక్కుపోయింది. రోగి శరీర స్థితిని మార్చుతూ పలుమార్లు ప్రయత్నించిన తర్వాత అక్కడి నుంచి బయటకు తీశారు. అనంతరం గొంతు సమీపంలోని మరో సన్నని ప్రాంతంలోనూ బ్రష్ చిక్కుకోవడంతో వైద్యులు జాగ్రత్తగా దాని దిశను మార్చి చివరకు నోటి ద్వారా పూర్తిగా తొలగించారు.

కొన్ని గంటల్లోనే డిశ్చార్జ్..

చికిత్స అనంతరం మరోసారి Endoscopy నిర్వహించి ఆహారనాళం, ఇతర భాగాల్లో గాయాలేమైనా ఉన్నాయా అని పరీక్షించారు. ఎలాంటి అంతర్గత గాయాలు లేవని నిర్ధారించుకున్నారు. రోగి ఆరోగ్యం మెరుగుపడటంతో కొన్ని గంటల పరిశీలన అనంతరం స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు. పెద్ద వస్తువులు లేదా టూత్ బ్రష్ వంటి వాటిని పొరపాటున మింగితే వెంటనే వైద్య సహాయం పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. వాంతులు చేసుకునేందుకు ప్రయత్నించడం లేదా ఆహారం తిని వస్తువును కిందకు నెట్టడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గొంతు, ఆహారనాళానికి గాయాలు కావచ్చు.

మరిన్ని వార్తలు