అమెరికాలో తెలుగు యువతి మిస్సింగ్

06-11-2026 | 10:45am

అర్ధరాత్రి వాకింగ్‌కు వెళ్లిన శ్రీజ.. ఆచూకీ ఏదీ?

నల్గొండ : అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటున్న నల్లగొండ జిల్లాకు(Nalgonda district) చెందిన తెలుగు యువతి కోయ శ్రీజ (23) అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. బోస్టన్‌లోని డోర్చెస్టర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఆమె నవంబర్‌ 2 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో స్థానిక పోలీసులు Search Operation చేపట్టి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నల్గొండ జిల్లా కనగల్‌ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకైక కుమార్తె శ్రీజ ప్రస్తుతం అమెరికాలో MS రెండో సంవత్సరం చదువుతోంది. నవంబర్‌ 2న కాలేజీకి వెళ్లిన ఆమె.. అనంతరం Part-time Job ముగించుకుని తన గదికి చేరుకుంది. అదే ప్రాంతంలో మరో ఎనిమిది మంది యువతులతో కలిసి ఆమె నివసిస్తోంది. ఆ రోజు రూమ్‌లో ఉంటున్న ఓ యువతి పుట్టినరోజు వేడుకలకు శ్రీజను ఆహ్వానించగా, వస్తానని స్నేహితులకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కాసేపు Walking చేసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్ స్విచ్ఛాఫ్.. చివరిసారిగా అక్కడే!

శ్రీజ బయటకు వెళ్లిన తర్వాత ఆమె మొబైల్ ఫోన్ సుమారు అర కిలోమీటరు పరిధి వరకు మాత్రమే Networkలో కనిపించిందని, ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయిందని తండ్రి యాదగిరిరెడ్డి వెల్లడించారు. నవంబర్‌ 2న రాత్రి సుమారు 9:45 గంటలకు ఎడిసన్‌ గ్రీన్‌ సమీపంలో ఆమె చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ప్రస్తుతం శ్రీజ కార్సన్‌ బీచ్‌ లేదా హార్బర్‌ పాయింట్‌ పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది. మరో ఆరు నెలల్లో MS చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి రావాల్సిన కుమార్తె ఇలా అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు