కేంద్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళతాం

30-09-2026 | 06:08pm

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళతామని, సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం ఒకరికొకరం సహకరించుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy) అన్నారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన కలెక్టరేట్ భవనం పేదవాడికి ఒక నమ్మకం కల్పించాలన్నారు.  పేదల సమస్యల చిక్కుముడులు విప్పడానికి ఈ కార్యాలయం ఉపయోగపడాలని తెలిపారు. సంక్షేమపథకాలు పేదలకు చేరవేసే ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులేనని గుర్తు చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశామని,  సహాయం కోసం నిస్సహాయంగా వచ్చే వారిలో మన కుటుంబ సభ్యులను చూడాలని, అప్పుడే సహాయం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని,  మీ సహకారంతో వీలైనంత మేరకు మీ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. మనం ప్రజలకు సేవలు అందిస్తూనే సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే ప్రజలకు మనపై విశ్వాసం బలపడుతుందన్నారు. మీరంతా కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా మంచి పేరు రావాలంటే ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు సేవలు అందించే మీకు మౌలిక వసతులు కల్పించాలని ఈ భవన సముదాయ నిర్మాణం పూర్తి చేశామని,  వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా కేంద్రం అనుమతులు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదన్నారు.  కానీ కొందరు మా పర్యటనలను లెక్కలేస్తున్నారని, సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందేనని స్పష్టం చేశారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు నెలల్లోనే 170 ఎకరాలు డిఫెన్స్ భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం బదలాయించేలా చేశామని, బేగంపేట రన్ వే కింద నుంచి రోడ్డు వేసుకునేందుకు అనుమతులు సాధించామన్నారు. మరోసారి జిల్లా అభివృద్ధిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు