అన్ని వృత్తుల నిపుణులను చెక్కే శిల్పి ఉపాధ్యాయుడు
ముకరంపుర,(విజయక్రాంతి): వైద్యుడు, ఇంజనీర్, న్యాయవాది, జడ్జి, టీచర్ లాంటి అన్ని వృత్తులకు చెందిన నిపుణులను చెక్కే శిల్పి ఆదర్శ ఉపాధ్యాయుడు మాత్రమే అని లయన్స్ జిల్లా గవర్నర్ లయన్ మోర భద్రేశం అన్నారు. ఈ రోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఆడిటోరియంలో లయన్ జిల్లా 320జీ నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం(National Teachers' Day)లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదించేది ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు.
సభాధ్యక్షత వహించిన లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి(Lions captain Dr. Burra Madhusudhan Reddy) మాట్లాడుతూ విద్యార్థి లోకాన్ని విద్యా బుద్ధులు కలిగిన పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దే గురువులుగా రూపాంతరం చెందాలని అన్నారు. విశిష్ట అతిథి ప్రథమ వైస్ గవర్నర్ లయన్ జి చంద్ర ప్రకాశ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు లేని సమాజం రాక్షసత్వంతో నిండి ఉంటుందని చెప్పారు. అనంతరం అధ్యాపకులను సన్మానించారు. అలాగే ప్రభుత్వ మహిళా డిగ్రీ పిజీ కళాశాల విద్యార్థినులకు ఉచిత రక్తహీనత సిబిపీ పరీక్షలు నిర్వహించారు.






