నాట్య శాస్త్రం ఒక విశ్వ భాష
లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్
కొత్తపల్లి, సెప్టెంబర్19(విజయక్రాంతి): భరతమాత కళకు పుట్టినిల్లుగా వైవిధ్యభరితమైన వారసత్వ సంపదను తరతరాలుగా అందిస్తూ వస్తున్నదని, ఈ కళ ఒక విశ్వ భాష అని, అలాంటి కళల్లో నాట్యశాస్త్రం ప్రధాన భూమికను పోషిస్తోందని ప్రముఖ వక్త, విశ్రాంత ప్లిన్సిపల్ లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రతన్ కుమార్ నాట్య కేంద్ర ఆవరణలో శాతవాహన లయన్స్ క్లబ్ నిర్వహించిన జాతీయ నాట్యశాస్త్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నాట్య కళను ఆబాలగోపాలం ఆదరిస్తారని తెలిపారు.
భారతదేశంలో సంగీత అకాడమీ గుర్తించిన ఎనిమిది సాంప్రదాయ నాట్యాల్లో భరతనాట్యం, కూచిపూడి, మోహినీయాట్టం, కథక్, కథకుల లాంటి ప్రఖ్యాత క్లాసికల్ డ్యాన్సులు మనల్ని అలరిస్తున్నాయని చెప్పారు. వీటికి తోడుగా అనేక జానపద నాట్యాలు కూడా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కళలను పోషించడం, ప్రోత్సాహం అందించడం జరగాలని ఆకాంక్షించారు. లయన్ మర్రిపెల్లి మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ రతన్ కుమార్తో పాటు వారి శిష్యులు ఎస్ వైష్ణవి, వినూత్న నాట్య కళాకారులను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్ ఎన్ వేణు గోపాల్, డా ఎస్ మనోహరాచారి, కె సత్యం, పి సురేందర్, తిరుపతి తదితరులు పాల్గొనగా, 60 మంది నాట్యశాస్త్రం నేర్చుకుంటున్న బాలికలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం పిల్లలు ప్రదర్శించిన నాట్యాలు పలువురి మన్ననలు పొందాయి.